Wednesday, 26 March 2014

అంటు వ్యాధుల గురించి ఇస్లామీయ షరీయత్‌ ఏమంటోంది?



 - అల్లామా ఇబ్ను బాజ్ (ర)
ప్రశ్న:- అంటు వ్యాధుల గురించి ఇస్లామీయ షరీయత్‌ ఏమంటోంది?
జవాబు:- వ్యాధుల్లో రెండు రకాలున్నాయి. ఒకటి:- వ్యాధిగ్రస్త్తుణ్ణి మాత్రమే బాధించేవి. రెండు:- వ్యాధిగ్రస్తునితోపాటు చుట్టప్రక్కల ఉన్నవారికి సైతం సొకేవి. ఇలాంటి అంటు వ్యాధుల్లో కూడా కొన్ని తేలికపాటివి, మరికొన్ని తీవ్రమైనవి ఉంటాయి. తేలికపాటి అంటువ్యాధుల విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. భయంకరమైన అంటువ్యాధలకు ఆమడ దూరాన ఉండటమే మంచిది. ఒకసారి దైవప్రవక్త (స) కుష్టు వ్యాధి సోకిన వ్యక్తితో కలిసి భోజనం చేశారు. అదేమంటే ''అల్లాహ్‌ాపై నమ్మకంకొద్దీ అలా చేశాన''న్నారు. (ఫత్‌హుల్‌ బారీ). మరికొన్ని ఉల్లేఖనాలు దీనికి భిన్నంగా ఉన్నాయి. ''కుష్టు రోగి నుండి పులి మాదిరిగా పారిపోండి'' (బుఖారీ)అని ఒక ఉల్లేఖనం ఉంది. ''రోగిష్టులైన ఒంటెలను ఆరోగ్యవంతమైన  ఒంటెల మందలోకి తోలకండి'' (బుఖారీ, ముస్లిం) అనే హదీసు కూడా ఈ సందర్భంగా గమనార్హమే.
  హజ్రత్‌ సాద్‌, హజ్రత్‌ అబ్దుర్రహ్మాన్‌ బిన్‌ ఔఫ్‌ (ర)ల కథనం ప్రకారం మహనీయ ముహమ్మద్‌ (స) ఒకసారి ఇలా అన్నారు: ''ఏదైనా ఒక ప్రదేశంలో ప్లేగు వ్యాధి ప్రబలినట్లు తెలిస్తే అక్కడకు వెళ్ళకండి. ఒకవేళ మీ స్థిర నివాసంలోనే గనక ఈ వ్యాధి ప్రబలినట్లయితే మీరు సైతం బయటికి వెళ్ళకండి''. (బుఖారీ)
  ఈ రెండురకాల ఉల్లేఖనాలను సమన్వయపరుస్తూ హాఫిజ్‌ ఇబ్నె హజర్‌ (ర) పండితుల ప్రవచనాలను క్రోడీకరించారు. పూర్వం అజ్ఞానకాలంలో జనులు వ్యాధుల గురించి ఎన్నో భయాందోళనలకు గురయ్యేవారు. వ్యాధులు స్వతహాగా అంటు స్వభావం కలవని, చాలా సులభంగా అవి ప్రజల్లో వ్యాపిస్తాయని ఇందులో దైవ శక్తికి, దైవ ప్రమేయానికి తావు లేదని నమ్మేవారు. ఇది సరైనది కాదు. ఏ ఉల్లేఖనాల ద్వారా అయితే 'అంటు' సోకుతుందని నిర్ధారణ అయిందో అవి సయితం దైవ ప్రణాళికకు లోబడి ఉన్నాయి. హాఫిజ్‌ ఇబ్నె హజర్‌ (ర) గారి వివరణను బట్టి అత్యధిక మంది విద్వాంసుల అభిమతం ఇదేనని రూఢీ అవుతోంది. (ఫత్‌హుల్‌ బారీ)
అయితే నేటి  వైజ్ఞానిక యుగంలోనూ అంటు వ్యాధులు కేవలం ఊహలకే పరిమితం కాలేదు. అనుదినం అవి తమ ప్రతాపాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాయి. దైవం మరియు దైవప్రవక్త (స) పలుకులు ఎన్నటికీ సత్య విరుద్ధం కాజాలవు. వాటిలో కొన్ని వ్యాధులు వైరస్‌ వల్ల వ్యాపిస్తుంటే మరికొన్ని తెలియని ఎన్నో కారణాల వల్ల విజృంభి స్తున్నాయి. స్వైన్‌ ప్లూ, చికెన్‌ గున్యా, డేంగూ వ్యాధులు ఈ మధ్యకాలంలో జన సముదాయాలను ఎలా గడ గడలాడించాయో విదితమే.  
వప్రశ్న: చాడీలు చెప్పటం, పరోక్ష నిందకు పాల్పడటాన్ని దివ్య ఖుర్‌ఆన్‌ ఖండించడమేగాక, దానిని చనిపోయిన తమ మృత సోదరుని మాంసం తినటంగా అభివర్ణించింది. అయితే ఏదైనా షరీయతు పరమార్థంతో పరోక్ష నింద చేయటానికి అనుమతి ఉందా?
జవాబు: చాడీలు చెప్పడం, వీపు వెనుక నిందించటం, సాటి ముస్లిం సోదరులలోని తప్పులను ఎంచటం ముమ్మాటికీ తీవ్రమైన విషయం, ఘోర అపచారమే. కానీ ఈ ఆదేశాలన్నీ ఇస్లామీయ వ్యవస్థ యొక్క ఉద్దేశాలకు, పరిణామాలకు లోబడి ఉంటాయి. ఏదైనా ఒక షరీయతుపరమైన ముఖ్య విషయానికి సంబంధించి ఒకరి పరోక్షంలో నిందించవలసిన, రహస్యాన్ని బహిర్గతం చేయాల్సిన అగత్యం ఏర్పడితే తప్పు లేదు. పైగా ఒక్కోసారి గుట్టు రట్టు చేయటం అవశ్యమవుతుంది.
  అందుకే చాడీలను నిరసించే హదీసులను క్రోడీకరించిన హదీసువేత్తలు, వాటిని వెల్లడించాల్సిన సమయం సందర్భాలను కూడా సూచించారు. ఉదాహరణకు:- ఇమామ్‌ బుఖారీ (రహ్మ) పెట్టిన ఒక మకుటంలో ''కలహాకారుల, కుత్సితుల గురించి మోపే నింద సమ్మతమే''. (బుఖారీ - 2/891)
  ఈ హదీసుకు ఆధారంగా ఒక సంఘటన- ఒక వ్యక్తి దైవప్రవక్త (స)ను కలుసుకునేందుకు అనుమతి కోరగా ఆయన (స) అందుకు అనుమతించారు. ఇది ప్రవక్త (స)లోని మంచితానికి నిదర్శనం. మరో వైపు ఆయన (స) ఆ వ్యక్తి గురించి తన ధర్మపత్ని ఆయిషా (ర)కు చెబుతూ, 'అతను తన వంశస్థులందరిలోకెల్లా చెడ్డవాడు' అనన్నారు. (బుఖారీ)
  అలాగే తన వద్దకు వివాహ సందేశం పంపిన ఇరువురు వ్యక్తుల నడవడిక గురించి హజ్రత్‌ ఫాతిమా బిన్తె ఖైస్‌ విచారించగా, ఆ ఇరువురు వ్యక్తులు కూడా ఆమెకు తగినవారు కారని దైవప్రవక్త (స) అబిప్రాయపడ్డారు.  ఆ ఇద్దరిలోనున్న లోపాలను ఆయన (స) ఆమెకు వివరించారు.

  గత్యంతరం లేని పరిస్థితిలో చాడీలు చెప్పడాన్ని ఇస్లామీయ విద్వాంసులు ధర్మ సమ్మతమన్నారు. ఉదాహరణకు:- అన్యాయాన్ని అడ్డుకోవడం, చెడుల నిర్మూలన, సంస్కరణ, ధార్మిక తీర్పులను కోరినప్పుడు, న్యాయస్థానంలో కేసు దర్యాప్తు జరుగుతున్నప్పుడు మొదలగునవి. ఒక వ్యవస్థలోని ప్రముఖులకు వారి తాబేదారుల నిజస్థితిని గురించి చెప్పటం, వివాహ సంబంధాల విషయంలో వధూవరుల గురించి ఉన్నదున్నట్టుల పరోక్షంలో వివరించటం, పాప కార్యాలకు, దురాచారాలకు పాల్పడేవారి గురించి నాయకులకు ఫిర్యాదు చేయటం కూడా ధర్మసమ్మతమే. (ఫత్‌హుల్‌ బారీ)

మదీనా - మస్జిదె నబవీ


 పూర్వం మదీనా నగరం 'యస్రిబ్‌'గా పిలువబడేది. మక్కా నుండి హిజ్రత్‌ చేసిన తర్వాత ప్రవక్త మహనీయులు(స)  ఈ నగరంలో స్థిరపడ్డారు. తన ఇంటి ప్రక్కనే ఆయన నిర్మించిన మస్జిద్‌ 'మస్జిదె నబవీ' (ప్రవక్త మస్జిదు)గా ప్రసిద్ధి చెందింది. మదీనా నగరం హరమె నబవీ (స)గా, దారుల్‌ హిజ్రత్‌గా ఖ్యాతి గడించింది. ఇంకా అది దైవాజ్ఞలు అవతరించిన కేంద్రంగా భాసిల్లింది. దైవప్రవక్త హజ్రత్‌ ఇబ్రాహీమ్‌ (అ) మక్కాను పవిత్ర స్థలంగా ఖరారు చేసినట్లే మహా ప్రవక్త (స) మదీనా నగరాన్ని పుణ్య  క్షేత్రంగా ఖరారు చేశారు. ఆయన (స) ఇలా విన్నవించుకున్నారు:
  ''ఓ అల్లాహ్‌! ఇబ్రాహీమ్‌ (అ) మక్కాను పవిత్ర స్థలం (హరమ్‌)గా ఖరారు చేశారు. నేను ఈ నగరం(మదీనా)లోని రెండు రాతి రపదేశాల నడుమ భాగాన్ని పుణ్య  క్షేత్రంగా ఖరారు చేస్తున్నాను''. (సహీహ్‌ ముస్లిం)
దైవప్రవక్త (స)  ఈ విధంగా ప్రవచించారు:
  ''పాము తన పుట్టలో శరణు పొందినట్లే విశ్వాసం (ఈమాన్‌) మదీనాలో శరణు పొందుతుంది. ఇక్కడి వైపరీత్యాలను, బాధలను ఓర్చుకున్నవాని కోసం నేను సిఫారసు చేస్తాను. సాక్షిగా ఉంటాను''. (సహీహ్‌ బుఖారీ, సహీహ్‌ ముస్లిం)
ఆయన (స) ఇంకా ఇలా వక్కాణించారు:
  ''మదీనా కొలిమి లాంటిది. అది తనవారిలోని తుప్పును దూరం చేస్తుంది. అందులోని మంచివారు మరింత నికార్సుగా తేలుతారు''. (సహీహ్‌ ముస్లిం)
మదీనా వాసుల గొప్పతనం
   మదీనాలో నివసించేవారు దైవప్రవక్త (స)కు ఇరుగుపొరుగువారు. ఆయన (స) మస్జిదుకు వచ్చేవారు, ఆయన నగరంలో స్థిరపడేవారు, ఆయన (స) పుణ్య క్షేత్రంలో నిలకడ చూపేవారు. ఆయన (స) వెలిగించిన దీపాలకు రక్షకులు. అలాంటివారిని ఆదరించాలి. వారితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి, వారిని అభిమానించాలి. వారితో స్నేహ సంబంధాలను కలిగి ఉండాలి. వారికి మనస్తాపం కలిగించ కూడదు. వారిని బాధించేవారిని హెచ్చరిస్తూ దైవప్రవక్త (స) ఇలా అన్నారు:
''మదీనా వాసులను మోసగించేవాడు నీటిలో ఉప్పు కరిగే విధంగా కరిగిపోతాడు''.  (సహీహ్‌ా బుఖారీ)
మదీనా ప్రజల ప్రేమాభిమానాల, గౌరవాదరణల కారణంగా ఆయన (స) వారి కోసం ప్రార్థించేవారు. ఉదాహరణకు ఒక ప్రార్థన-
''ఓ అల్లాహ్‌! వీళ్ళ తూకాల్లో శుభాన్ని ఒసగు. వీళ్ళ కొలతలైన 'సా' 'ముద్‌'లలో సమృద్ధిని ప్రసాదించు''.  (సహీహ్‌ ముస్లిం)
మదీనా వాసుల పట్ల సద్వ్యవహారం చేయమని ఆయన (స) యావత్తు అనుచరులకు తాకీదు చేస్తూ ఇలా అన్నారు:
''మదీనా నా వలస కేంద్రం. ఇదే నా విరామ స్థలం. నా పునరుత్థానం ఇక్కడి నుంచే జరుగుతుంది. నా పొరుగువారు ఘోర అపరాధాలకు ఒడిగట్టకుండా ఉన్నంతవరకూ వారిని రక్షించవలసిన బాధ్యత నా అనుచర సమాజం (ఉమ్మత్‌)పై ఉంది. ఎవరైతే వారిని రక్షిస్తారో వారి కొరకు నేను సిఫారసు చేస్తాను, సాక్షిగా ఉంటాను''. (తిబ్రానీ).
మస్జిదె నబవీ (వ్రవక్త మస్జిదు) గొప్పతనం:
భూమండలంలోని మూడు గొప్ప మస్జిదులలో మస్జిదె నబవీ ఒకటి. దీని మహత్తును స్పష్టపరుస్తూ అంతిమ దైవప్రవక్త (స) ఇలా ప్రవచించారు:
1) ''నా ఈ మస్జిద్‌లో నమాజు చేయటం - ఒక్క మస్జిదె హరమ్‌ తప్పించి - వేరితర మస్జిద్‌లలో చేసే వెయ్యి నమాజులకన్నా ఘనమైనది''. (ముస్నదె అహ్మద్‌)
2) ''మస్జిదె హరమ్‌లో నమాజు చేయటం వేరితర మస్జిద్‌లలో చేసే లక్ష నమాజుకన్నా శ్రేష్ఠమైనది''. (ముస్నదె అహ్మద్‌)
3) ''మూడు మస్జిద్‌లు తప్ప మరో దాని వైపు పుణ్యఫలాపేక్షతో వాహనాలను సిద్ధపరచరాదు. అవేమంటే - 1) మస్జిదె హరమ్‌ 2) మస్జిదె నబవీ 3) మస్జిదె అఖ్సా''.
4) ''నా నివాస గృహానికి - (ఈ మస్జిద్‌లోని) నా వేదిక (మింబర్‌)కి మధ్య ఉన్న స్థలం స్వర్గ వనాలలోని ఒక వనం''. (సహీహ్‌ బుఖారీ, సహీహ్‌ ముస్లిం)


మహా నగరిలో మహా ప్రవక్త మహితోక్తులు



మానవసృష్టికి మునుపే ఫరిష్తాల కాలం నాటిది కాబా గృహం. ఆకాశంలో దైవ దూతల ఆరాధనా  క్షేత్రం బైతుల్‌ మామూర్‌ అయితే, అవనిలో మనుజ భక్తుల ప్రార్థనాలయం ఈ ప్రతిష్ఠాలయం. భువిలో తొలి దైవ గృహం, భూతల స్వర్గం ఈ గృహం. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స) హృదయాలను ఏలిన మహీతలం మక్కా నగరం. అనాదిగా ఈ గృహం విశ్వ మానవ మార్గదర్శక కేంద్రం.

ఇదో విశిష్ఠతైతే...
ఈ పుణ్య  క్షేత్రానికి దైవ ప్రవక్తలందరూ తమ జీవితకాలంలో  ఏదో ఒక సందర్భాన వచ్చి దర్శించుకున్నట్లు, వారిలోని అనేక మంది ప్రవక్తలు తమ శేషజీవితాన్ని ఇక్కడే గడిపినట్లు అమరవీరులై కీర్తిశేషులైనట్లు చరిత్ర చెబుతోంది.
 
  ఈ మహా నగరాన్నే పూర్వం 'బక్కా' అని పిలిచేవారు. ఎట్టి శత్రువునయినా ఇట్టే  క్షమించి వదిలేయాలన్నది దానర్థం. ఎంత మధురం! ఎంత మనోహరం - మక్కా నగరం!! బైబిల్లో, పురాణాల్లో, ప్రపంచ ఇతిహాసాల్లో - అంతిమ దైవ గ్రంథం ఖుర్‌ఆన్‌లో - ఈ పవిత్ర పురం గురించి ఎన్నో వర్ణనలు, ఉదంతాలు ఉన్నాయి. ప్రవక్తల పితామహులు హజ్రత్‌ ఇబ్రాహీమ్‌ (అ) తన పుత్ర రత్నంతో కలిసి ఈ పవిత్ర గృహాన్ని పునర్నిర్మించారన్నది ప్రసిద్ధిగాంచిన ప్రతీతి. ఆ కుమారుని పేరు ఇస్మాయీల్‌. ప్రవక్త (స) వారి వంశానికి మూల పురుషుడు, వారిరువురి ప్రార్థనా ఫలితమే మహా  ప్రవక్త  ముహమ్మద్‌   (స)   వారి  ప్రభవనం. ముహమ్మద్‌ (స) వారు ప్రభవింపజేయబడింది ఈ నగరంలోనే.  

  ఆ నగరం భక్తిపరులకు ఆలవాలం. సత్యసంధులకు పంట పొలం. సాత్వికులకు, శాంతి ప్రియులకు ఆలయం. అటువంటి మహా నగరం కొన్నేళ్ళుగా అంధకారాలతో, మూఢ నమ్మకాలతో అతలాకుతలమవుతూ ఉంది. అట్టి తరుణంలో ప్రకృతి ధర్మాన్ని , సంపూర్ణ ధర్మ శాస్త్రాన్ని, అంతిమ గ్రంథాన్ని, దివ్య జ్ఞానాన్ని అనేక రేఖల్లో, రూపాల్లో - అక్షరాల్లో - ఆచరణల్లో అభిషేకించేందుకు వచ్చారు మహా ప్రవక్త ముహమ్మద్‌ ((స). నీతి నడవడికలు, సత్యం ధర్మాల రీత్యా ఆయనో మహోన్నత పర్వత శిఖరం. అందునుండి ఎన్నో సెలయేర్లు లకం నలుదిశలా ప్రవహించి - మహా నదులై - ఎందరెందరో సత్యార్తిని తీర్చి - అనంత, అద్భుత, అద్వితీయ ఆదర్శప్రాయుల్ని చేశాయి.
 
ఇవీ ఆ పవిత్ర పురానికీ, పుర ప్రవక్తకు సంబంధించిన కొన్ని పూర్వేతిహాసాలు. ఇక ఆ నగరంలో ఆయన చిలికించిన అమృత జల్లులు, ఆదర్శ పలుకుల గురించి తెలుసుకుందాం! పవిత్రమైన మార్గదర్శక కేంద్రాన్ని ఫలవంతం చేయడానికీ, ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దడానికి నిర్మలమైన దివి నుండి కురిసిన కారుణ్య జల్లే, అంతరాత్మ హరివిల్లే అంతిమ ప్రవక్త ముహమ్మద్‌ (స). అజ్ఞానులకు జ్ఞానకాంతులనిచ్చి, చీకట్లలో మ్రగ్గుతున్న  జనాలకు వెలుగు బాట చూపి సత్య మార్గాన శాంతి పథాన నడిపించేందుకు ఆవిర్భవించిన క్రాంతికారుడే, శాంత మూర్తియే కారుణ్య ప్రవక్త ముహమ్మద్‌ (స).
  తెల్లవారు జామున మంచు కురిసే వేళలో ఎడారి ఓడల   క్ష్షీరసాగరాలు, పక్షుల కిల కిలారావాలు, అండ పిండ బ్రహ్మాండాల స్తుతిగీతాల, ప్రత్యూషాల దైవన్నామ స్మరణలు, రెక్కల్లో తల దూర్చి ఆత్మ పరిశీలన చేసు కుంటున్న పక్షులు - అప్పుడే తొలిజాము తొలి కోడి కూసింది. చల్లని నీటితో వుజూ చేసుకుని పవిత్ర భావాలతో పరమోన్నతుడి సన్నిధిలో మోకరిల్లేందుకు బయలుదేరారు ప్రవక్త శిఖామణి (స). మలి కోడి కూసే వేళకు ప్రార్థన పూర్తి చేసుకుని దివ్యగ్రంథ పఠనంలో లీనమైనారు. ప్రపంచ  చీకట్లను పటా పంచలు చేసేందుకు ఆ ప్రభాకరుడు పగటి పూట ఉదయిస్తే, ప్రజల జీవితాల్లో వెలుగును నింపేందుకు నిద్రను త్యజించి నిశిరాత్రి ప్రార్థనల్లో ప్రభువు సన్నిధానంలో ప్రణమిల్లు తున్నాడు ఈ ధర్మ ప్రభాకరుడు. ఆ రవికిరణం చీకటి పడ్డాక కనుమరుగైపోతే, ఈ రవితేజం రాత్రిళ్లు సైతం తేజోవంతమై వెలుగు నందిస్తున్నాడు. తెల్ల వారింది... సూర్య కాంతులతో తడి స్నానాలు చేస్తోందీ లోకం. ప్రియ ప్రవక్త (స) వారు ప్రజల జీవితాలను జ్యోతిర్మయం చేసేందుకు, వారి అంతరాత్మ చక్షువుల్ని తెరిచేందుకుమొద్దు నిద్ర నుండి వారిని తట్టి లేపేందుకు, వాస్తవ జగత్తులో, సత్యామృతంలో జలకాలాడించేందుకు, వారి పుట్టుకకు పరమార్థాన్నిచ్చేందుకు, వారి బ్రతుకు బాట సరి చేసేందుకువారి ఉనికికి లక్ష్యాన్ని బోధించేందుకు, వారి జీవితాల్ని పునీతం చేసేందుకు, వారి జన్మను ధన్యం గావించేందుకు బయలు దేరారు దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స).
 
మనిషి జీవితానికి అర్థాన్నిచ్చే అంతిమ ప్రవక్త ముహమ్మద్‌ (స). సత్యవంతుల సత్యార్తిని తీర్చే జీవ జలం దివ్య ఖుర్‌ఆన్‌. మనిషికి స్వర్గ సౌఖ్యాలను, కోరిన వరాలను అనుగ్రహించే శాంతి మార్గం ఇస్లాం. చీకటి అనే జగత్తులో విరిసిన క్రాంతి మొగ్గ, శాంతి ప్రభాకరుడు ప్రియ ప్రవక్త. అందానికే అందమైన ఆయనకు అలంకారాలు దేనికన్నట్లు దేదీప్యమానంగా వెలిగిపోతోంది ఆయన వదనం. ఆ దృశ్యం ఎంత మధురం! ఎంత ముగ్ద మనోహరం!! ఆయనే ధర్మజ్యోతి అయితే చీకట్లు పటాపంచలు కావా, శాంతి సామరస్యాలను తేవా? ప్రేమ పూరితమైన ఆయన పలుకులు మధురాను భూతులలో మైమరపించే దివ్య వాణులు. మరపురాని, మరచిపోలేని మహితోక్తులు. రండీ! విని తరించండి!!  

 

తొలకరి జల్లు కురిసిన వేళ..!




సయ్యిద్ అబ్దుస్సలామ్ ఉమ్రీ

 భానుడి  ప్రతాపానికి తాళలేక మారు మూలలో దాగిన జీవకోటి మొత్తం తొలకరి చినుకు తాకగానే భూపొరల్ని చీల్చుకుని బయటికి వస్తాయి. వాడిపోయిన నేల పొత్తిళ్ళలో తలవాల్చిన మొక్కలన్నీ మొగ్గ తొడిగి మౌనరాగమాలాపిస్తాయి. కొత్త చిగురై పల్లవిస్తాయి. నవ్వుల జల్లులు వెల్లి విరుస్తాయి. పుడమి పరవశించి పచ్చని ప్రకృతిని ప్రసవిస్తుంది. మామి చిగురు తిన్న కోయిలలన్నీ గొంతెత్తి స్వరఝరిని అందు కుంటాయి. నీరసంగా నదురించే నెమలి ఒక్కసారిగా పురివిప్పి నాట్యమయూరి అవుతుంది. పక్షుల కిలకిలలు, నదుల గలగలలతో వాతవరణమంతా ఆనంతభరిత మౌతుంది. ఇది వాన జల్లు తాకిడితో ధరణిలో వచ్చిన పరివర్తనం. అదే అంతిమ ప్రవక్త ముహమ్మద్‌ (స) వారి అమృత పలుకుల తాకిడితో మానవ మనో మస్తిష్కాలు విప్పారుతాయి. మానవ మనో ధరణిలో మూఢ విశ్వాసాలకు తాళ లేక మూలమూలల్లో దాగిన గుణకోటి మొత్తం ప్రవక్త (స) వారి అమృత జల్లుతో జీవం పోసుకుంటాయి. దానవుడికన్నా మానవుడే గొప్పంటూ హృదయ కవాటాలు తెరుచు కుంటాయి. ఎండిపోయిన మనో భూమి  పొత్తిళ్ళలో తలవాల్చిన ప్రేమ, జాలి, కరుణ, ఆప్యాయత, అనురాగం, త్యాగం అన్నీ మొగ్గలు తొడిగి మానవత్వపు దివ్వెలు  వెలిగిస్తాయి. మనిషిలోన అణగారి ఉన్న నైపుణ్యాలు, ప్రతిభా పాటవాలు పురి విప్పి ప్రగతి పథాన పయనిస్తాయి. శాంతి మూర్తులై, క్రాంతికారులై లోకశాంతికై  పోరాడుతాయి. జగమంతా శాంతి సాత్వికతలను నెల కోల్పుతాయి.
  ఎంత మధురం! ఆయన పలుకులు. ఎంత మనోహరం ఆ స్పర్శ సత్యామృతాన్ని గుండెలో నింపుకొచ్చినట్లు. ఎంతటి సుగంధభరితం! నిదురపోతున్న మానవుణ్ణి తట్టి లేపుతున్నట్లు. ఎంత హాయి! మరచిపోయిన మనిషి పాఠాన్ని గుర్తు చేస్తున్నట్లు. అన్నీ ఆయన అమృత పలుకుల చిలుకులతోనే సాధ్యం. అవి నిత్యం, నిర్విఘ్నంగా కురిసే స్వాతి చినుకులు. పడిన స్థలాన్ని బట్టి ఫలాన్నిస్తాయి. తూర్పు పడమరల స్వామి సాక్షిగా! సత్య ప్రేరణలను సదా మానవ హృదయాల్లో  కలిగించేందుకు 
 ఆయన పలుకులు క్షణం వింటే చాలు. వందేళ్ళు జీవించే మనిషైనా, నీటి మీద బుడగలా క్షణకాలం బ్రతికే వ్యక్తి అయినా ఆయన పలుకుల్ని హృదయానికి హత్తు కుంటే, ఆయన ఆదర్శాల్లో నడుచుకుంటే అతని బ్రతుకు ధన్యమవుతుంది. మరణించాక కూడా ఆయన (స) చేసిన ఉపకారానికి రుణపడి ఉంటుంది. అట్టి ఆత్మకు దేవుని దీవెనలూ అందుతాయి, దైవ దూతల ఆశీర్వాదాలూ ప్రాప్తమవుతాయి, ప్రజల ప్రశంసలూ లభిస్తాయి. అదిగో దైవ వాణి ఏదో చెబుతున్నట్లుంది.... శ్రద్ధగా వినండి!
  (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: ''మీకు నిజంగానే అల్లాహ్‌ా పట్ల ప్రేమ ఉంటే (మీరు నిజంగా అల్లాహ్‌ాను ప్రేమించేవారైతే) మీరు నన్ను అనుసరించండి. (తత్ఫలితంగా) అల్లాహ్‌ మిమ్మల్ని ప్రేమిస్తాడు. మీ పాపాలను మన్నిస్తాడు. ఆయన అమితంగా  క్షమించేవాడు, అపారంగా కనికరించేవాడు''.  (ఆలి ఇమ్రాన్‌: 31)
ప్రియ ప్రవక్త (స) తల పైకెత్తి అందరి వంకా చూశారు.  అనిర్వచనీయమైన ప్రశాంతత వారందరిని ఆవహించింది. గంభీర స్వరంతో ఆయన (స ) ఇలా ప్రబోధించారు:
       ''ఖూలూ లా ఇలాహ ఇల్లల్లాహ్‌ తుఫ్లిహూ''. భూప్రపంచం మీ వశమయ్యే అద్భుత సూత్రం చెప్పనా - 'దేవుడ ఒక్కడే' అని విశ్వసించండి. ఇది పూబాట అని నేననటం లేదు. సత్యమార్గం కఠినమైనదే అయినా ఆ బాటనే సాగిపోండి. ఇనుప దువ్వెనలతో ఎముకల నుంచి మీ మాంసాన్ని వేరు చేసినా, మిమ్మల్ని నిలబెట్టి నిలువునా రెండుగా చీల్చినా, భగభగమండే అగ్ని గుండంలో మిమ్మల్ని పడేసినా, అగ్గి మీద కట్టేసి మిమ్మల్ని వేంచేసినా, ఆస్తిపాస్తుల్ని కొల్లగొట్టినా, మిమ్మల్ని అనాథల్ని చేసినా మీరు మాత్రం ధర్మ మార్గాన్నే అంట బెట్టుకుని ఉండండి. ఎటువంటి క్లిష్ట స్థితిలోనూ దైవ త్రాటిని విడనాడకండి. శిశిరం అందమైన తోటంతటినీ ధ్వంసం చేసినట్టు జీవిత పరీక్షలు మిమ్మల్ని అతలాకుతలం చేసేసినా మీరు సత్యాన్నే నమ్ముకోండి. మిథ్యావాదాల్ని, దైవాల్ని త్యజించండి. గుర్తుంచుకోండి, సత్యం మిమ్మల్ని దైవ ప్రేమకు పాత్రుల్ని చేసినట్లే, అది మిమ్మల్ని మరణ శిక్షలు కూడా వేయిస్తుంది. ఆదరిస్తే అది మీ పురోభివృద్ధికి, స్వర్గ అధిరోహణకు తొడ్పడినట్లే, అదమరిస్తేఅధఃపాతాళానికి తొక్కివేస్తుంది. అది మీ ఔన్నత్యాన్ని కీర్తిశిఖరాలకు చేర్చినట్లే, కాసింత అశ్రద్ధ వల్ల కిందికి దిగి భూమిని గట్టిగా అంటిపెట్టుకుని ఉన్న మీ పాదాల్ని ఊపివేస్తుంది. మీలో విశ్వాసులు ఎవరో, కపటులెవరో నిగ్గు తేల్చడానికి అది అలా చేస్తుంది. మిరు సాధుస్వభావులుగా, శాంతికాముకులుగా, సత్యవంతులుగా ఉండాలనీ, మిమ్మల్ని అన్నీ దాస్యపు బంధనాల నుండి బంధ విముక్తుల్ని చేయాలనీ, మిమ్మల్ని సంపూర్ణ స్వేచ్ఛాపరుల్ని చేయాలనీ, ధాన్యాన్ని దంచినట్లు, సత్యం మిమ్మల్ని దంచిపొట్టంతటినీ చెరుగుతుంది. మీరు సాధుస్వభా వులుగా ఉండాలని  సత్యం మీ మధ్య విశ్వాస సంబంధాన్నిపటిష్టపరుస్తుంది. మీరు చేసే ప్రతి పని దైవానికి ప్రియమయ్యేటట్లు మీ వ్యక్తిత్వాలను  మలుస్తుంది. కొలిమి నగల తయారీలో వాటిలోని నురుగును ఎలా తిసిపారేస్తుందో, అలాగే సత్యం మీలోని లొపాలను పాపాలన్నింటిని కడిగివేస్తుంది. ప్రభువుకు నచ్చినది, ప్రజలు మెచ్చినది మేలు చేసేది మాత్రమే మీ మనో భూమిలో మిగిలి ఉంటుంది. మీ హృదయ ప్రక్షాళనం చేస్తుంది. మీ ఉనికి లక్ష్యాన్ని మీరు గ్రహించేలా మీకు జ్ఞాన బోధ చేస్తుంది. దివ్యవాణి ఇలా అంటుంది:
 ''మేము విశ్వసించాము'' అని చెప్పినంత మాత్రాన తాము ఇట్టే వదలివేయ బడతామనీ, తాము పరీక్షింపబడమనీ ప్రజలు అనుకుంటున్నారా? వారికి పూర్వం గతించిన వారిని  కూడా మేము బాగా పరీక్షించాము. వీరిలో సత్యవంతులెవరో, అసత్యవాదులెవరో నిశ్చయంగా అల్లాహ్‌ా తెలుసుకుంటాడు''. (అల్‌ అన్‌కబూత్‌: 3)

  ''ఏమిటి? వీరు స్వర్గంలో ఇట్టే ప్రవేశించ గలమని అనుకుంటున్నారా? వాస్తవానికి మీకు పూర్వం గతించిన వారికి ఎదురైనటువంటి పరిస్థితులు మీకింకా ఎదురు కానే లేదు. వారిపై కష్టాల కడగండ్లు, రోగాల వరదలు విరుచుకు పడ్డాయి. వారు ఎంతగా కుదిపివేయ బడ్డారంటే, (ఆ ధాటికి తాళలేక) ''ఇంతకీ దైవ సహాయం ఎప్పుడొస్తుంది?'' అని ప్రవక్తలు, వారి సహచరులు పెడబొబ్బలు పెట్టారు. వినండి! అల్లాహ్‌ా సహాయం సమీపంలోనే ఉంది'' (అని వారిని ఓదార్చడం జరిగింది). (అల్‌ బఖరా: 214)

Wednesday, 5 March 2014

బాల ముహమ్మద్‌ (స.అ.సం)కు శతకోటి దీవెనలు


ధరిత్రిపైన దయ – కరుణ – ప్రేమ – మమతల మల్లెలు చల్లేందుకు వచ్చిన మహనీయులు ముహమ్మద్‌ (స). మానవ హృదయాల్ని ప్రక్షాళనం చేసి వాటిలో ఒక నూతన శక్తిని నింపి మానవత్వపు మందారాలు పూయించడానికి ప్రభవించిన మహోపకారి మహా ప్రవక్త ముహమ్మద్‌ (స).
మానవ సమాజంలో ఐకమత్యం- అన్యోన్నత- అనురాగం- సదవగాహన- సుహృద్భావం వెల్లివిరియాలన్నదే ఆయన తపన. న్యాయం- ధర్మం- వివేకం- విజ్ఞానం ప్రజల్లో నెలకొనాలి అన్నదే ఆయన ఆశయం. ఎవరి కర్మలకు వారిని బాధ్యుల్ని చేసి, ఎవరి అంతరాత్మను వారికి గురువుగా చేసి చూపడానికి ప్రభవింపజేయబడిన అత్యుత్తమ సుగుణ సంపన్నులు ముహమ్మద్‌ (స). అంతేకాని మానవుల్ని విడదీసి, మానవత్వాన్ని మారణ హోమానికి ఆహుతి చేయడానికి కాదు ఆయన వచ్చింది. అంతటి ఘనుల్ని- మక్కా వాసులు ఎందుకు వెలివేసినట్టు? సత్యం అంటే ఎందుకంత అసహ్యం? అవిశ్వాస అంధకారాల్లో పడి మ్రగ్గడమే వారి అభిమతమా?? అసలేం జరిగింది? రండీ! తెలుసుకునేందుకు అంతిమ ప్రవక్త ముహమ్మద్‌ (స) వారి గత స్మృతుల్ని నెమరు వేసుకుందాం!! న్యాయం ఎటుందో నిర్ణయిద్దాం!!!
ఆదికాలం నుండి మానవులను ఉద్ధరించ డానికి అనేకమంది ప్రవక్తలు, మహాత్ములు వచ్చారు. ఎంత మంది మహాత్ములు ఎంత బోధించినా ప్రజల్లో మాత్రం మార్పు వచ్చినట్లు వచ్చి మళ్ళీ మాయమైంది. పనివాడు యజమానికి- యజమాని పైఅధికారికి- పైఅధికారి మంత్రికి- మంత్రి చక్రవర్తికి- చక్రవర్తి మతాచార్యునికి – మతాధిపతి విగ్రహానికి బానిసై బ్రతుకుతూ వస్తున్నారు. దానికే అలవాటు పడ్డారు. ఆ అలవాటునే ఆరాధనగా భ్రమించారు.
కాలమేదైనా, ప్రాంతమేదైనా, భాష ఏదైనా, ‘విగ్రహారాధన’ అనే విష వృక్షాన్ని ఈ భూమిపై ప్రతిష్టింపజేయించింది షైతానే. ప్రజలచే ప్రజలకు హారతి పట్టే, పూజించే ఆచారాన్ని ప్రవేశ పెట్టింది మొదట షైతాన్‌. మనిషికి నాటి నుండి నేటి వరకు బద్ధ శత్రువు షైతాన్‌.
పై కారణాల వల్లనే అప్పటి సమాజంలో అన్యాయం రాజ్యమేలేది. దౌర్జన్యం, దుర్మార్గం తాండవమాడేది. అధర్మం, అసత్యం అపనింద, అపకీర్తి, అవినీతి, ద్రోహం, మోసం, కాపట్యం, విశ్వాస ఘాతకం, ఎగతాళి, తిరస్కారం, మాయ, వంచన, వ్యభిచారం, మద్యసేవనం, అంతర్విభేదం, సతీ సహగమనం- అప్పటి ప్రజల సహజ లక్షణాలుగా చెలామణి అవుతుండేవి. ఇలా బానిసత్వం అనేది ఏదో ఒక రూపంలో వారి మధ్య మసలుతూ ఉండేది. అజ్ఞానం వల్ల అది గొప్పగా- గర్వంగా అంగలు వేస్తూ నంగనాచిలా నడుస్తుండేది. మూర్ఖత్వం- అహంకారం- అవివేకం వల్ల ఎప్పుడూ ఎవరూ పలకరించే దిక్కులేక మానవత్వం మూగదై ఓ మూల తల దాచుకుంది. అలా వారిలో రాక్షసత్వం పెచ్చరిల్లి ‘మంచి’ని బోధించేవారెందరినో మంటల్లో మాడ్చి మసి చేసింది. అలా ఎందరో సత్య మూర్తులు సత్యానికై ప్రాణాలర్పించు కున్నారు. అప్పుడు…. అంతటి…. ఆ …. అంధకారంలో తళుక్కున మెరిసిందొక ఆశా కిరణం! అది మానవ జాతికే మహోదయం!!
ముసలిదై-చీడపట్టి-శక్తిహీనమై-సారహీనమై- భ్రష్టమై- దుష్టమైన నాటి (అ)నాగరికత విష వృక్షాన్ని కూల్చివేయడం కోసం బలీయంగా – భయంకరంగా భూగర్భంలో విస్తరించిన దాని వేళ్ళను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేయడానికి, అత్యాశ, అన్యాయం, అపరాధం, ధనపిపాస అనే దాని పుష్పాలను కాళ్ళతో నలిపి వేయడం కోసం, దుఃఖం, శోకం, భయం, దైన్యం, దుర్దశ, దౌర్భాగ్యం, బానిసత్వం అనే దాని ఫలాలను కోసి విసిరే యడం కోసం నూతనోత్సాహంతో, ఉత్తేజంతో, ఉప్పెనలా స్వేచ్ఛగా – సాహసో పేతంగా దేహం దాల్చడానికి ఓ పవిత్రాత్మ సిద్ధమవుతోంది…! ఆ శుభ తరుణం రానే వచ్చింది…!!
రాత్రి చీకటి నుంచి పగటి కాంతిలోకి అకస్మాత్తుగా ఆవిర్భవించిన తెల్ల గులాబి పువ్వువలే లేలేత బుగ్గల సుతి మెత్తని చిన్నారి చేతులతో, తేజోవంతమైన ముఖ సౌందర్యంతో జన్మించారు బాల ముహమ్మద్‌ (స). ‘పువ్వు పుట్టగానే పరిమళించినట్లు’ ఉంది ఆయన జననం. ఆ క్షణం – అంధ కారాన్ని తేజస్సుగా, దుఃఖాన్ని సంతోషంగా, నిరాశను ఆశగా ఆనందంగా మార్చివేసింది. మానవ జాతి జీవితాల్ని తేజోవంతం చేయడానికి దివి నుండి భువికి దిగి వచ్చిన దివ్య జ్యోతి బాల ముహమ్మద్‌ (స). ఆయన నగ్న పాద స్పర్శతో పుడమి పులకించింది. గాలి ఆయన ముంగురులతో ఆడుకోవ టానికి ఆరాట పడుతోంది.
ఆకాశం నిర్మేఘంగా, నిర్మలంగా ఉంది. వాతావరణం ప్రశాంతంగా ఉంది. సముద్రం నిశ్చలంగా, నిరాడంబరంగా ఉంది. ‘నువ్వు అద్భుతానంద సుందర జగత్తును దర్శిస్తావు. ప్రకృతి సౌందర్యాన్ని, అంతిమ సత్యాన్ని, సంపూర్ణ ధర్మాన్ని, దివ్యజ్ఞానాన్ని అనేక రేఖల్లో – రూపాల్లో, అక్షరాల్లో తిలకిస్తావు. అవి పాఠకునికి, పరిశీలకునికి, పండితునికి, పామరునికి, అన్వేషకునికి ఎంతో ఆనందానుభూతిని కలిగిస్తాయి’ అని మౌనంగానే దీవిస్తున్నాయి. అవును- అందమైన అతి విలువైన ఆణి ముత్యాల్ని- ఆదర్శాల్ని- ఆశయాల్ని- అభి ప్రాయాల్ని సమస్త మానవాళికి అందజేసి, వారి హృదయాల్ని ఉత్తేజపరచమని, ఉత్తమంగా మలచమని దివినున్న ఆ పరమాత్మ భువికి ఈ చిట్టి ఆత్మను పంపాడు.
దయ – కరుణ – ప్రేమ – సౌభ్రాతృత్వాలు నీలో మూర్త్తీభవించి ఉన్నాయి. కనుక నీవు అన్ని కాలాలకు, అన్ని జాతులకు, అన్ని ప్రాంతాలకు, అన్ని మతాలవారికి అభిమాన పాత్రుడవవుతావు. ఇది దైవం ముందుగా మాకు తెలియజేసిన నీ భవిష్యవాణి నాయనా!
బాబూ! నువ్వొక మహోన్నత పర్వత శిఖరానివి. అందు నుండి స్వచ్ఛమైన జల సంపద గల ఎన్నో సెలయేర్లు, జలపాతాలు నేల నలుదిక్కులకూ ప్రవహించి- మహా నదులై ఎందరెందరివో సత్యార్తిని తీరుస్తాయి. అనంత జీవనవాహినిని ప్రసరింపజేస్తాయి.
చుట్టూ ఆకాశాన్ని అంటే పర్వతాలు, గుంపుగా ఎగురుతూ పలుకరించుకునే గువ్వలు, ఏటవాలు లోయలు, సాగర సౌందర్యం, అందున దాగిన నిధులు, ఉవ్వెత్తున ఎగసిపడే కెరటాలు, ఊగిపోతున్న వృక్షాలు, నేలతో సరసాలాడుతున్న సూర్యచంద్ర నక్షత్రాలు. నింగి, నింగిలోని గ్రహాలు, గమనాలు, పాలపుంతలు- అన్నీ ఆ శిశువును నిండు హృదయంతో, నిర్మల మనస్సుతో ఆశీర్వదిస్తున్నాయి.